For faster navigation, this Iframe is preloading the Wikiwand page for తెలుగు సినిమా చరిత్ర.

తెలుగు సినిమా చరిత్ర

వికీపీడియా నుండి

వెండితెర సందడి
తెలుగు సినిమా
• తెలుగు సినిమా వసూళ్లు
• చరిత్ర
• వ్యక్తులు
• సంభాషణలు
• బిరుదులు
• రికార్డులు
• సినిమా
• భారతీయ సినిమా
ప్రాజెక్టు పేజి

1931నుండి తెలుగు సినిమాలలో వచ్చిన ప్రగతి "తెలుగు సినిమా చరిత్ర" అనే ఈ వ్యాసంలో ఇవ్వబడింది.

తెలుగు సినిమా ఆరంభ దశ

[మార్చు]

1886లో లుమీర్ సోదరులు భారతదేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో "భక్త పుండరీక", 1911లో "రాజదర్బార్" అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని విడుదల చేశాడు.

1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ (అలం అరా), తెలుగు (భక్త ప్రహ్లాద), తమిళ (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథిహెచ్.ఎమ్.రెడ్డి. సురభి నాటక సమాజం వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన భక్త ప్రహ్లాద తెలుగులో మొదటి సినిమాగా స్థానం సంపాదించుకొంది. తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సినిమా 1932 జనవరి 22న సెన్సార్ జరుపుకొని, 1932 ఫిబ్రవరి 6న బొబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ లో విడుదలైంది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదలైంది.[1]

తెలుగు సినిమా 1931-1940

[మార్చు]
భక్త ప్రహ్లాద

1931-1940 దశకంలో మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా భక్త ప్రహ్లాదతో ప్రారంభమై పౌరాణిక చిత్రాల పరంపర కొనసాగింది. ఎక్కువగా రంగస్థల నటీనటులే సినిమాలలో కూడా ఆయా పాత్రలను పోషించేవారు.

ఈ కాలంలో ప్రతిభను కనపరచిన దర్శకులలో కొందరు సి.పుల్లయ్య (లవకుశ), సిహెచ్.నరసింహారావు(సీతా కళ్యాణం), హెచ్.వి.బాబు (కనకతార), పి.పుల్లయ్య(శ్రీవెంకటేశ్వర మహత్యం), సిహెచ్.నారాయణ (మార్కండేయ).

1936లో కృత్తివెన్ను సోదరులు నిర్మించిన ప్రేమ విజయం తెలుగులో మొదటి సాంఘిక చిత్రం. ఇది అంతగా విజయవంతం కాలేదు. తరువాత హెచ్.ఎమ్.రెడ్డి నిర్మించిన గృహలక్ష్మి సినిమాతో చిత్తూరు నాగయ్య సినీరంగంలో ప్రవేశించాడు.

1939లో బి.ఎన్.రెడ్డి, కె.రామనాథ్, ఎ.కె.శేఖర్‌లు కలిసి "వాహినీ" చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. వందేమాతరం వాహిని వారి తొలి సినిమా. తరువాత వరవిక్రయం సినిమాలో భానుమతి సినీ ప్రస్థానం ఆరంభమైంది.

1938-39 సంవత్సరాలలో తెలుగు సినిమా కొత్త రూపు దిద్దుకుంది. సినిమా ప్రయోజనం ఒక్క వినోదం సృష్టించడం మాత్రమే కాదు - విప్లవం కూడా సృష్టించగలదని ఆ రెండు సంవత్సరాలు నాంది పాడాయి. కేవలం పురాణ గాథలే సినిమాలుగా వస్తూ ప్రజానీకాన్ని ఆనందపరుస్తున్న తరుణంలో గూడవల్లి రామబ్రహ్మం "మాలపిల్ల" లాంటి చిత్రం తీసి, విప్లవం సృష్టించాడు. ఆ వరసలో ఆ రెండేళ్ళలోనూ గృహలక్ష్మి(1938, రోహిణి, హెచ్.ఎం.రెడ్డి, నాగయ్య, కన్నాంబ), వందేమాతరం (1939, వాహిని, బి.ఎన్.రెడ్డి, నాగయ్య, కాంచనమాల), మళ్ళీ పెళ్ళి (1939, వై వి.రావు, కాంచనమాల), రైతుబిడ్డ ( 1939, సారథి, గూడవల్లి రామబ్రహ్మం, సూరిబాబు, టంగుటూరి సూర్యకుమారి), వరవిక్రయం (1939, కాళ్ళకూడి నారాయణరావు, భానుమతి) లాంటి సమస్యాత్మక విషయాలపై చిత్రాలు విడుదలై తెలుగు సినిమాని పై స్థాయిలో నిలబెట్టాయి.

సాంఘిక సమస్యలు కథావస్తువుగా అంతకు ముందొచ్చిన "బాల యోగిని" (1937) చిత్రానికి సహకార దర్శకులుగా పని చేయ్యడం, వ్యంగ్యధోరణిలో సమాజాన్నీ రాజకీయాలని దుయ్యబట్టే రీతిలో "ప్రజామిత్ర" పత్రికను నడపడం - "మాలపిల్ల" నిర్మాణానికి ప్రేరణ కావచ్చు. "మాలపిల్ల" చిత్రాన్ని నిషేధించాలని కొన్ని వర్గాలు ప్రయత్నాలు చేసినా అవి సాగలేదు. నిరాటంకంగా నడచి, ఆ చిత్రం ఆర్థికంగా కూడా విజయం సాధించింది. ఆ విజయాన్ని పురస్కరించుకొనే రామబ్రహ్మం "రైతుబిడ్డ" ఆరంభించారు. జమిందారీ విధానాలను ఎదిరించి, రైతు సమస్యలను ప్రజలముందు పెట్టిన చిత్రమిది. ఈ సమస్యలను వస్తువుగా తీసుకుని రామబ్రహ్మంగారే కథ అల్లారు. తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశారు. గోపీచంద్ దర్శకత్వశాఖలో కూడా పనిచేశారు.

కొసరాజు రాఘవయ్య చౌదరి "ప్రజామిత్ర" పత్రికలో రాజకీయ వ్యంగ్య కవితలు రాసేవారు. ఆ మైత్రితో కొసరాజు చేత పాటలు వ్రాయించారు. అందులో ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా వేసారు. "సై సై చిన్నపరెడ్డి", "నిద్ర మేల్కొనరా తమ్ముడా" (సూరిబాబు గానం) మొదలగు పాటలు కొసరాజు గారు, మరికొన్ని సముద్రాల, తాపీ గార్లు వ్రాశారు. రైతు ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న ఎన్. వెంకట రామానాయుడు వ్రాసిన పాటలు కూడా చిత్రంలో పాడటం జరిగింది. "మాలపిల్ల"లో బసవరాజు అప్పారావుగారి పాటలు వాడారు. మాటలు: చలం, తాపీ గార్లు. సన్నివేశాన్ని బట్టి ఒక్కో రచయిత ఒక్కో పాటను వ్రాయగలడు అన్న భావని ప్రవేశ పెట్టింది గూడవల్లిగారే కావచ్చు. హాస్య సన్నివేశాలను ప్రత్యేకంగా విశ్వనాథ వారిచే వ్రాయించారు.

చిత్రానికి నృత్య దర్శకుడు వేదాంతం రాఘవయ్య. నట వర్గం: బళ్ళారి రాఘవాచార్య, గిడుగు, పి. సూరిబాబు, నెల్లూరు నాగరాజారావు, టంగుటూరి సూర్యకుమారి, ఎస్.వరలక్ష్మి 1939 లో చిత్రం విడుదల గావటానికి ముందు చాలా అవాంతరాలు కలిగించపడ్డాయి. పేర్కొనదగ్గ విషయమేమంటే "సారధి" సంస్థ యజమాని యార్లగడ్డ శివరామప్రసాద్ (చల్లపల్లి జమిందారు). జమిందారీ విధానం మీద, పెత్తనాల మీదా ఒక జమిందారే చిత్రం నిర్మించడం గొప్ప విషయం.

1939 అక్టోబరులో అంధ్ర కేసరిగా ప్రసిద్ధికెక్కిన టంగుటూరి ప్రకాశం మద్రాసు అసెంబ్లీలో ప్రవేశబెట్టబోయే "ప్రకాశం బిల్లు"కు ప్రచారంగా ఈ చిత్రం తోడ్పడింది. అలాగే జరగబోయే జిల్లాబోర్డు ఎన్నికల్లో జమీందారులకు వ్యతిరేక ప్రచారంలో కూడా ఉపయోగపడింది.

విడుదలకు సిధ్ధంగా వున్న చిత్రాన్ని నిషేధించటానికి వెంకటగిరి, బొబ్బిలి జమీందారులు నోటీసులు ఇచ్చారు. విడుదల రోజునే (27. ఆగస్టు '39) వారి లాయర్లు నెల్లూరు వచ్చి, చిత్రాన్ని చూసి నోట్సు వ్రాసుకొని వెళ్ళారు. అలాగే నిర్మాతలకు రిజిష్టర్డ్ నోటీసులు పంపటం, వారి ఎస్టేటులలో ప్రదర్శిస్తే - సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకొంటామని బెదరించటం జరిగింది. చివరకు నెల్లూరు జిల్లా మేజిస్ట్రేట్ ద్వారా వెంకటగిరి పట్టణం లోనే కాదు, తాలూకా లోనే కాదు పూర్తి గూడూరు డివిజన్ లోనే చిత్రాన్ని నిషేధించ గలిగారు.

సెన్సారుబోర్డు సంపూర్ణంగా నిషేధించలేదు కాబట్టి వారిపై కూడా ఒత్తిడి తీసుకొని రావడం జరిగింది. కాని అక్కడ జమీందారుల ఆటలు కొనసాగలేదు. మేజిస్ట్రేట్ చర్య న్యాయ బద్ధం కానప్పటికి మద్రాసు ప్రభుత్వం కూడా చూసి చూడనట్లు ప్రవర్తించటం గమనార్హం. ఇలా జమీందార్ల అక్రమాలకు వంతపాడటం ప్రజలకు ఆగ్రహాన్ని కలిగించింది. విడుదలకు తరువాత నిషేధించాలన్న ప్రయత్నాల్లు మరింత తీవ్రమయ్యాయి. కొన్ని చోట్ల ఫిల్మ్ ఫ్రింట్స్ దగ్ధం చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి. చిత్రంలోని కొన్ని పాత్రలు తమ వ్యక్తిత్వం మీద దెబ్బతీసే పధ్ధతిలో వున్నాయని బొబ్బిలి, వెంకటగిరి రాజాలు చిత్ర నిర్మాతల మీద దావా తెచ్చారు. మొత్తానికి కొంతకాలం కొన్ని జిల్లాలలో నిషేధించబడింది (నిర్మించిన చల్లపల్లి రాజాగారి కృష్ణా జిల్లాలో కూడా).

సినిమాలు ప్రజలమీద ఒత్తిడి తీసుకురాగలవన్న నమ్మకం మాలపిల్ల, రైతుబిడ్డ చిత్రాలతోనే ఆరంభమైంది. ఎంత సంచలనం రేపగలిగినా అనేక అవాంతరాలవల్ల "మాలపిల్ల" లాగా ఆర్థికవిజయం సాధించలేకపోయింది. నిషేధాలు, కోర్టులు, బెదిరింపులు, ఆర్థికనష్టంవంటివన్నీ రావటంతో ఎంత సాంఘిక చైతన్యంగల మనిషయినా రామబ్రహంగారు మరల అలాంటి ప్రయత్నం చెయ్యలేక పోయారు.

వై.వి.రావు నిర్మించిన మళ్ళీపెళ్ళి చిత్రంద్వారా వితంతు వివాహాలను ప్రోత్సహించారు. ఇల్లాలు చిత్రం ద్వారా సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు, శ్రీకృష్ణ లీలలు చిత్రం ద్వారా గాయని బాల సరస్వతి సినీరంగానికి పరిచయమయ్యారు.

ఈ కాలంలో కళాకారులు తమపాటలను తామే పాడుకొనేవారు. ఈ దశకంలో రంగప్రవేశం చేసిన కళాకారులలో కొందరు - ఈలపాట రఘురామయ్య, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, కె.శివరావు, రేలంగి, గోవిందరాజులు సుబ్బారావు, కొంగర జగ్గయ్య, శాంతకుమారి, కన్నాంబ, కృష్ణవేణి, కాంచనమాల, ఎస్.వరలక్ష్మి, పుష్పవల్లి.

తెలుగు సినిమా 1940-1950

[మార్చు]

ఈ దశాబ్దంలో 91 సినిమాలు నిర్మించబడ్డాయి. "వాహినీ స్టూడియోస్" ప్రారంభించబడింది. నేపథ్యగానం ప్రక్రియ స్థిరపడింది. ఈ దశకంలో ఎందరో కళాకారులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించారు. తరువాతి కాలంలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కావడానికి వారి ప్రతిభ, కృషి ముఖ్యమైన కారణాలు. అలా వచ్చినవారిలో కొందరు-

  • దర్శకులు - కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, భరణి రామకృష్ణారావు, ఘంటసాల బ్రహ్మయ్య, కె.బి.నాగభూషణరావు, కె.ఎస్.ప్రకాశరావు, బి.ఎ.సుబ్బారావు
  • నటీనటులు -అక్కినేని నాగేశ్వరరావు (సీతారామ జననం), నందమూరి తారక రామారావు (మనదేశం), ఎస్.వి.రంగారావు (వరూధిని), అంజలీదేవి (గొల్లభామ), సావిత్రి (సంసారం), జానకి (షావుకారు), గుమ్మడి వెంకటేశ్వరరావు (అదృష్టదీపుదు), గౌరీనాధ శాస్త్రి (భీష్మ), లింగమూర్తి (భక్తపోతన), ముక్కామల కృష్ణమూర్తి (మాయామశ్చీంద్ర), సూర్యకాంతం (నారద నారది̲).
  • గాయనీ గాయకులు, సంగీత దర్శకులు - ఘంటసాల వెంకటేశ్వరరావు (స్వర్గసీమ), పెండ్యాల నాగేశ్వరరావు (ద్రోహి), పి.లీల (గుణసుందరి కథ)
  • రచయితలు - పింగళి నాగేశ్వరరావు (వింధ్యరాణి), ఆత్రేయ (దీక్ష), ఆరుద్ర (బీదలపాట్లు)
  • ఛాయాగ్రాహకులు - మార్కస్ బార్ట్‌లీ, ఆలీ.ఎమ్.ఇరానీ, కె.రామనాధ్

ఇంకా బలమైన నిర్మాణ సంస్థలు ఆవిర్భవించి తరువాతి కాలంలో పరిశ్రమ అభివృద్ధికి పునాదులు వేసాయి. పోటీని ప్రవేశపెట్టాయి. అలాంటి వాటిలో కొన్ని - భరణీ పిక్చర్స్ (రత్నమాల), ప్రకాష్ పిక్చర్స్ (మొదటి రాత్రి), ప్రతిభా పిక్చర్స్ (పార్వతీ కళ్యాణం), శోభనాచల పిక్చర్స్ (భక్త పోతన), రోహిణీ పిక్చర్స్ (తెనాలి రామకృష్ణ), విజయా పిక్చర్స్ (షావుకారు), పక్షిరాజా (బీదల పాట్లు), సాధనా పిక్చర్స్ (సంసారం).

కాని ఈ దశకం స్టార్ వాల్యూ పరంగా నాగయ్య యుగమని చెప్పుకోవచ్చును. భక్త పోతన, యోగి వేమన, త్యాగయ్య చిత్రాలు ఆయనను అగ్రశ్రేణి నాయకునిగా చేశాయి. సంసారం, పల్లెటూరి పిల్ల - రెండు సినిమాలు మల్టీస్టారర్స్‌గా (ఎన్.టి.ఆర్, అక్కినేనిలు జంట నాయకులుగా) వెలువడ్డాయి.

ఈ దశాబ్దంలో ముఖ్యమైన సినిమాలు.

భక్త పోతన

తెలుగు సినిమా 1950-1960

[మార్చు]

ఈ దశకంలో 327 సినిమాలు వెలువడినాయి. ఇది తెలుగు సినిమాలకు స్వర్ణయుగమని చెప్పవచ్చును. క్రొత్త నటీనటుల ప్రవేశ పరంపర కొనసాగింది. క్రొత్త చిత్ర నిర్మాణ సంస్థలు చాలా వెలిసాయి. హైదరాబాదులో సారథి స్టూడియోస్ ప్రాంభమైంది. వారి మొదటి చిత్రం "మా ఇంటి మహాలక్ష్మి". ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం చలన చిత్రాలకు వివిధ అవార్డులను ప్రవేశ పెట్టింది.

ఈ దశాబ్దంలో ప్రాంభమైన కొన్ని ముఖ్య నిర్మాణ సంస్థలు - అన్నపూర్ణా స్టూడియోస్ (దొంగ రాముడు), అనుపమమ పిక్చర్స్ (ముద్దుబిడ్డ),, రాజ్యం పిక్చర్స్ (దాసి), అంజలి పిక్చర్స్ (అనార్కలి), వినోదా పిక్చర్స్ (స్త్రీ సాహసం), శాలిని పిక్చర్స్ (అమర సందేశం), విక్రమ్ ప్రొడక్షన్స్ (మాగోపి), నేషనల్ ఆర్ట్ థియేటర్స్ (పిచ్చి పుల్లయ్య, రాజశ్రీ పిక్చర్స్ (అనసూయ), అశ్వరాజ్ పిక్చర్స్ (అన్నదాత), విఠల్ ప్రొడక్షన్స్ (కన్యాదానం), నవశక్తి ఫిల్మ్స్ (మా ఇంటి మహాలక్ష్మి), జగపతి పిక్చర్స్ (అన్నపూర్ణ).

వెండితెరకు పరిచయమైన నటీనటులు - జగ్గయ్య (ఆదర్శం), కాంతారావు (ప్రతిజ్ఞ (1953 సినిమా)), బాలయ్య (ఎత్తుకు పై ఎత్తు), రమణమూర్తి (ఎం.ఎల్.ఏ.), హరనాధ్ (మా ఇంటి మహాలక్ష్మి), జమున (పుట్టిల్లు), కృష్ణకుమారి (నవ్వితే నవరత్నాలు), దేవిక (రేచుక్క), గిరిజ (పరమానందయ్య శిష్యుల కథ), బి.సరోజాదేవి (పాండురంగ మహత్యం), చలం (పల్లె పడుచు), రమణారెడ్డి (మానవతి), రాజబాబు (సమాజం), రాజ సులోచన (కన్నతల్లి).

ప్రజానాట్య మండలి నుండి ఎదిగిన దర్శకుడు డాక్టర్ రాజారావు తన పుట్టిల్లు సినిమా ద్వారా చాలామంది రంగస్థల కళాకారులను సినిమారంగానికి పరిచయం చేశాడు. అలాంటివారిలో అల్లు రామలింగయ్య ఒకడు. ఇదే కాలంలో మిక్కిలినేని, ఆర్.నాగేశ్వరరావు, రాజనాల, ప్రభాకర రెడ్డి, నిర్మల, పి.హేమలత మొదలగు నటీనటులు సినీరంగంలో అడుగుపెట్టారు.

ఇక దర్శకుల విషయానికొస్తే - ఆదుర్తి సుబ్బారావు (అమర సందేశం) సినిమా దర్శకత్వంలో క్రొత్తపోకడలు ప్రవేశపెట్టాడు. వేదాంతం రాఘవయ్య (దేవదాసు), తాతినేని ప్రకాశరావు (పల్లెటూరు), తాపీ చాణక్య (రోజులు మారాయి), యోగానంద్ (అమ్మలక్కలు), రజనీకాంత్ (వదినగారి గాజులు), కె.బి.తిలక్ (ముద్దుబిడ్డ), కమలాకర కామేశ్వరరావు (చంద్రహారం), సి.ఎస్.రావు (శ్రీకృష్ణ తులాభారం), వి.మధుసూదనరావు (సతీ తులసి) వంటి ప్రతిభావంతులైన దర్శకులు ఈ దశకంలో వెండితెరను ఒక వెలుగు వెలిగించారు.

కొసరాజు, శ్రీశ్రీ, సముద్రాల రాఘవాచార్య, డి.వి.నరసరాజు, సముద్రాల జూనియర్, పింగళి నాగేశ్వరరావు మొదలైన రచయితలు ఈ సమయంలో ముఖ్యమైన పాటల, మాటల రచయితలు. పి.సుశీల (కన్నతల్లి), ఎస్.జానకి (ఎం.ఎల్.ఏ..), ఎ.ఎమ్.రాజా, పి.బి.శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, కె.రాని, ఎ.పి.కమల ఈ సమయంలో ముఖ్య నేపథ్యగాయకులు. ఘంటసాల, పెండ్యాలల సంగీతానికి మంచి డిమాండ్ ఉంది. టి.వి.రాజు, ఆదినారాయణరావు, దక్షిణామూర్తి, అశ్వత్థామ, టి.చలపతిరావు కూడా చాలా చిత్రాలకు సంగీతాన్నందించారు. డబ్బింగ్ ప్రక్రియ ఈ సమయంలో బాగా అభివృద్ధి చెందింది.

అప్పటి సినిమా పోస్టరు [1]

ఈ దశకంలో విడుదలైన ఎవర్‌గ్రీన్ చిత్రాలు కొన్ని.

తెలుగు సినిమా 1960-1970

[మార్చు]
అలనాటి అందాల కథానాయికలు [2]

ఈ దశకంలో మొత్తం 552 సినిమాలు నిర్మించబడ్డాయి. మొదటి పూర్తి రంగుల చిత్రం లవకుశ వెలువడింది. సాంకేతిక విలువలు, ప్రధానంగా ఫిల్మ్ ప్రాసెస్సింగ్ అభివృద్ధి చెందాయి. నంది అవార్డులు ప్రారంభమయ్యాయి.

ఆదుర్తి సుబ్బారావు ఆందరూ కొత్త నటులతో తీసిన తేనెమనసులు సినిమాలో హీరోగా కృష్ణ మరి కొందరు నటులు రంగప్రవేశం చేశారు. ఇంకా ఈ దశకంలోనే శోభన్‌బాబు, చంద్రమోహన్, కృష్ణంరాజు, జి. రామకృష్ణవంటి హీరోలు, జయలలిత, కె.ఆర్.విజయ, వాసంతి, రాజశ్రీ, వాణిశ్రీ, కాంచన, ఎల్.విజయలక్ష్మి, విజయనిర్మల, శారద వంటి నటీమణులు,, సత్యనారాయణ, ధూళిపాళ, రావుగోపాలరావు వంటి కారెక్టర్ ఆర్టిస్టులు, రావి కొండలరావు, కె.వి.చలం, మాడా, రమాప్రభ వంటి హాస్య నటీనటులు తెలుగు సినీ రంగంలో ప్రవేశించారు.

డి.రామానాయుడు తమ "సురేష్ ప్రొడక్షన్స్" చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి తీసిన మొదటి చిత్రం రాముడు భీముడు మంచి విజయం సాధించింది. మంగమ్మ శపధంతో డి.వి.ఎస్.రాజు, కంచుకోటతో యు.విశ్వేశ్వరరావు చిత్ర నిర్మాణంలోకి దిగారు.

సంగీతపరంగా ఘంటసాల, పెండ్యాల, ఎస్.రాజేశ్వరరావులతో బాటు కె.వి.మహదేవన్ పుష్కలంగా బాణీలందించారు. చెళ్ళపిళ్ళ సత్యం, టి.జి.లింగప్ప, ఎస్.పి.కోదండపాణి కూడా చాలా చిత్రాలలో పనిచేశారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా గాయకుడుగా ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమాకు పరిచయమయ్యారు.

ఈ దశకంలోనే ముళ్ళపూడి వెంకటరమణ, గొల్లపూడి మారుతీరావు, భమిడిపాటి రాధాకృష్ణ, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి ప్రభృతులు సినిమారంగంలో రచయితలుగా అడుగుపెట్టారు. పాటల రచయితలుగా సి.నారాయణ రెడ్డి, దాశరధిలకు మంచి ఆదరణ కొనసాగింది.

దర్శకులలో బాపు (సాక్షి), కె.ఎస్.ఆర్.దాస్ (లోగుట్టు పెరుమాళ్ళకెరుక), కె.విశ్వనాధ్ (ఆత్మగౌరవం), ప్రత్యగాత్మ (భార్యాభర్తలు), ఎమ్.మల్లికార్జునరావు, (గూఢచారి 116), తాతినేని రామారావు, (నవరాత్రి), పేకేటి శివరాం (చుట్టరికాలు) ఎన్నదగినవారు. నటుడు ఎస్.వి.రంగారావు రెండు సినిమాలకు (చదరంగం, బాంధవ్యాలు) దర్శకత్వం వహించాడు. హీరోయిన్ సావిత్రి కూడా మాతృదేవత చిత్రానికి దర్శకత్వం వహించింది. అయితే ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వెలువడిన మూగ మనసులు (1964 సినిమా) ఈ దశాబ్దపు సంచలన విజయం సాధించిన సినిమా. ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు కలసి చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై నిర్మించిన సందేశాత్మక చిత్రాలు సుడిగుండాలు, మరో ప్రపంచం ఆర్థికపరంగా విజయవంతం కాలేదు. జగ్గయ్య నిర్మించిన పదండి ముందుకు, రాజ్యం పిక్చర్స్ వారి నర్తనశాల అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించబడ్డాయి.

ఈ దశాబ్దపు ఎన్నదగిన సినిమాలు

తెలుగు సినిమా 1970-1980

[మార్చు]

ఈ దశాబ్దంలో మొత్తం 758 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో చాలావరకు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రనిర్మాణానికి అయ్యే అదనపు ఖర్చును భరించడానికి వీలుగా రాష్ట్రప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో రాష్ట్రంలో చిత్రనిర్మాణం పుంజుకుంది.

హీరో కృష్ణ పాశ్చాత్య కౌబోయ్ కథారీతిలో మోసగాళ్ళకు మోసగాడు సినిమా నిర్మించాడు. దసరా బుల్లోడు చిత్రంతో వి.బి.రాజేంద్ర ప్రసాద్ దర్శకుడయ్యాడు. దర్శకులలో దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు తమ ప్రతిభను, వైవిధ్యాన్ని ప్రదర్శించారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన అంతులేని కథ, మరో చరిత్ర మంచి విజయం సాధించాయి. వి. రామచంద్రరావు దర్శకత్వం వహించిన అల్లూరి సీతారామరాజు తెలుగులో మట్టమొదటి "సినిమా స్కోప్" చిత్రం. దేవతలారా దీవించండి సినిమాను నలుపు-తెలుపు, సినిమా స్కోపులో నిర్మించారు. దర్శకులుగా పి.సి.రెడ్డి, లక్ష్మీదీపక్, సింగీతం శ్రీనివాసరావు, కె.బాపయ్య, రచయితలుగా జంధ్యాల, సత్యానంద్, పరుచూరి బ్రదర్స్ బాగా రాణించారు. చాలా సినిమాలకు చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించాడు. పాటల రచయితగా వేటూరి సుందరరామ మూర్తి విజృంభించాడు.

నందమూరి తారక రామారావు స్వయంగా దాన వీర శూర కర్ణ సినిమాకు నిర్మాత, దర్శకుడు. అందులో మూడు పాత్రలను ధరించి మెప్పించాడు. ఇది ప్రధానంగా యాక్షన్, క్రైమ్ చిత్రాల దశకం. విజయ చందర్, మురళీమోహన్, గిరిబాబు, ప్రసాద్ బాబు, నారాయణ రావు, మోహన్ బాబు, నరసింహ రాజు, బాలకృష్ణ,చిరంజీవి, సంగీత, లక్ష్మి, హేమాచౌదరి, జయచిత్ర, జయసుధ, జయప్రద, సుజాత, లత, సుమలత, విజయశాంతి ఈ కాలంలోనే వెండితెరకు పరిచయమయ్యారు. ఈ దశాబ్దం మొదట్లో బాలనటిగా నటించిన శ్రీదేవి దశాబ్దాంతానికి హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకర్షించింది. రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్, జె.వి.సోమయాజులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి ఆదరణ సంపాదించారు.

బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాల ముగ్గు, కె.విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం తెలుగు సినీ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొన్నాయి. ఈ రెండు సినిమాలకూ కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు. జి. రామకృష్ణ, జి.ఆనంద్, జేసుదాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, కె.జమునారాణి, వాణీ జయరాం నేపథ్య గాయనీ గాయకులుగా రాణించారు.

మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు పొందిన క్రాంతి కుమార్ స్త్రీ పాత్రల ఆధారంగా శారద, జ్యోతి, కల్పన వంటి సినిమాలు నిర్మించాడు. హీరో-విలన్-క్యారెక్టర్ ఆర్టిస్టు కృష్ణంరాజు తన స్వంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ పై నిర్మించిన కృష్ణ వేణి,అమరదీపం, భక్త కన్నప్ప సినిమాలు విజయవంతాలు కావడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొన్నాయి.

తెలుగు సినిమా 1980-1990

[మార్చు]

ఈ దశాబ్దంలో రికార్డు స్థాయిలో 1665 సినిమాలు నిర్మించబడ్డాయి. కాని వాటిలో విజయవంతమైనవి 25% లోపే.

నందమూరి తారక రామారావు నటించిన సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, నాదేశం వంటి చిత్రాలు ఆయన రాజకీయాలలో అడుగుపెట్టడానికి అనుకూలమైన సందేశాలు ఇచ్చాయి. ఈ సమయంలో దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి అగ్రస్థానంలో ఉన్న దర్శకులు. కోడి రామకృష్ణ, జంధ్యాల, రేలంగి నరసింహారావు కూడా విజయవంతంగా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. జంధ్యాల దర్శకత్వంలో ఆనంద భైరవి, అహనా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగు స్తంభాలాట వంటి చిత్రాలు విజయవంతమై హాస్య చిత్రాలకు క్రొత్త ఒరవడి సృష్టించాయి. శివ చిత్రం విజయం ద్వారా రాంగోపాల్ వర్మ అనే ప్రతిభావంతుడైన యువ దర్శకుడు చిత్ర రంగానికి పరిచయమయ్యాడు.

క్రియేటివ్ కమర్షియల్స్ కె.ఎస్.రామారావు, యువ చిత్ర కె.మురారి, విజయవాహిని ఆర్ట్స్ టి.త్రివిక్రమరావు, గోపీ ఆర్ట్స్ గోపి, లక్ష్మీ ఫిలిమ్స్ అనురాధా దేవి ఈ దశకంలో ప్రముఖ నిర్మాతలు. వేజెళ్ళ సత్యనారాయణ సందేశాత్మక చిత్రాలు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. రామోజీరావు సినిమా నిర్మాతగా మారి శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, ప్రతిఘటన వంటి నాణ్యమైన సినిమాలు నిర్మించాడు. పద్మాలయా స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ ప్రారంభమైనాయి.

రచయితలుగా పరుచూరి బ్రదర్స్, పాటల రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి బాగా రాణించారు. నటునిగా చిరంజీవి అగ్ర స్థానంలో ఉన్నాడని చెప్పవచ్చును. ఈ కాలంలోనే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు సీనియర్ సినీ ప్రముఖులకు వారసులుగా రంగంలో మంచి గుర్తింపు పొందారు. మోహన్ బాబు నటుడిగానూ, నిర్మాతగానూ మంచి విజయాలు సాధించాడు. ఆవేశపూరితమైన పాత్రలలో రాజశేఖర్ (నటుడు), హాస్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్ కథానాయకులుగా సుస్థిర స్థానం సంపాదించారు.

నటీమణులలో శ్రీదేవి, జయప్రద, జయసుధ, సుజాత, రాధిక, విజయశాంతి, రాధ అత్యధిక సినిమాలలో నటించారు. కామెడీ పాత్రలలో బ్రహ్మానందం అగ్రస్థానంలో ఉండగా మల్లికార్జునరావు, సుత్తివేలు, వీరభద్రరావు, శ్రీలక్ష్మి వంటి ప్రతిభాశాలురైన హాస్యనటులు తెలుగుతెరపై విజృంభించారు. కోట శ్రీనివాసరావు అన్ని విధాల పాత్రలలోనూ ఆదరణ పొందగలిగాడు.

సంగీత దర్శకులుగా చక్రవర్తి ఎక్కువ సినిమాలకు సంగీతం అందించాడు. ఇళయరాజా, రాజ్-కోటి, రమేష్ నాయుడు కూడా చాలా సినిమాలకు సంగీత దర్శకులు. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, ఎస్.జానకి, పి.సుశీల, వాణీ జయరాం ప్రముఖ నేపథ్య గాయకులు.

హీరో కృష్ణ తెలుగులో మొదటి 70 ఎమ్.ఎమ్. సినిమాగా సింహాసనం నిర్మించాడు. సినిమా అభివృద్ధికోసం ఎ.పి.స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్థాపించబడింది. 1984లో 2 లక్షలు రూపాయలున్న సబ్సిడీ 1989నాటికి 3 లక్షలుకు పెంచారు. పన్నులలో స్లాబ్ సిస్టమ్ ప్రవేశ పెట్టారు. అందువలన మిశ్రమ ఫలితాలు సంభవించాయి.

1981 నుండి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రారంభమైనది.

ఈ దశాబ్దంలో ముఖ్యమైన చిత్రాలు:

తెలుగు సినిమా 1990-2000

[మార్చు]

దాదాపు 950 స్ట్రయిట్‌ తెలుగు చిత్రాలు ఈ కాలంలో విడుదలయ్యాయి. ఇక ఈ కాలంలో బి.గోపాల్‌, ఈవీవీ, రాంగోపాల్‌వర్మ, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, భీమనేని శ్రీనివాసరావు వంటి క్రియేటివ్‌ దర్శకుల హవా పెరిగింది.

"తెలుగు సినిమా చరిత్ర" గ్రంథం

[మార్చు]

ప్రపంచ సినీ పితామహులు లూమియర్ బ్రదర్స్ 1896 జూలై 7 న బొంబాయిలోని వాట్సన్ హోటల్ లో ఏర్పాటు చేసిన తొలి చలన చిత్ర ప్రదర్శన ద్వారా భారత దేశంలోకి చలనచిర రంగం ప్రవేశించింది. అది మొదలు గత 100 సంవత్సరాల భారతీయ చలనచిత్ర చరిత్ర, 1931లో ప్రారంభమైన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమగ్ర చరిత్రపై వెంకటేశ్వర్లు బులెమోని ఏడున్నర సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "తెలుగు సినిమా చరిత్ర".

ఈ "తెలుగు సినిమా చరిత్ర" గ్రంథంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన సమగ్ర చరిత్ర, సాంకేతిక అభివృద్ధి, తెలుగు చలనచిత్ర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు, 1931 నుంచి 1997 దాకా వచ్చిన మేటి చలనచిత్రాల సమీక్ష, సంవత్సర వారీగా విడుదలైన సినిమాల పూర్తి వివరాలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ఈ గ్రంథాన్ని నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్ ప్రచురించగా, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, నవోదయ బుక్ హౌజ్, ప్రజాశక్తి బుక్ హౌజ్లు సమ్యుక్తంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. అప్పటి కేంద్ర మంత్రి యు. కృష్ణం రాజు 25 నవంబర్ 1997 న ఈ గ్రంథాన్ని విడుదల చేశారు.

ఈ "తెలుగు సినిమా చరిత్ర" గ్రంథానికిగాను ఉత్తమ గ్రంథంగా రాష్ట్ర ప్రభుత్వ "నంది అవార్డు", ఉత్తమ రచయితగా "యువకళావాహిని" అవార్డు రచయితకు లభించాయి.

తెలుగు సినిమా 2000-2010

[మార్చు]

ఇక 2000-2010 మధ్య కాలంలో సినిమా డిజిటల్ యుగాన్ని అందిపుచ్చుకుని, ఆన్ స్క్రీన్ వండర్స్ ను సృష్టిస్తోంది. ఫలితంగా తెలుగు సినిమా అతి వేగంగా తెరకెక్కుతూ.. హాశ్చర్యపరుస్తోంది. త్రీడీ టెక్నాలజీ.. డిజిటల్ ఇంటర్మీడియట్.. గ్రాఫిక్స్.. రంగాలు వాటి సేవలు శరవేగంగా హైదరాబాదులో విస్తృతమయ్యాయి. మనది సినిమా పిచ్చోళ్ల దేశం అంటారు జావేద్ అక్తర్. సినిమా మనకు తెలుపు నలుపు రంగుల కాలంలో ఎంతగా ఆలరించిందో.. ఆలోచింపజేసిందో.. రంగుల కాలంలోనూ అవే సుగుణాలు పుణికిపుచ్చుకుంది. సమాంతర చిత్రాలు.. సందేశాత్మక చిత్రాలు.. ఇలా పేరేదైనా.. సినిమా సత్యజిత్ రే చూపిస్తే ఒకలా.. చంద్రశేఖర్ఏలేటి చూపిస్తే మరోలా ఆవిష్కృతమైంది. మన జీవనంలో భాగమైంది. మ్యాథ్స్ ఫార్ములాలను.. ఒంటబట్టించుకున్న సుకుమార్ తరం ఇప్పుడు నడుస్తోంది గనుక.. ఈ తరం సినిమా సిగ్మండ్ ఫ్రాయిడ్ ను.. అయన్ రాడ్ ను.. నిషేను.. ప్రతిభావంతంగా వాడుకుంటోంది. ప్రభావ శీలక మాధ్యమంగా ఎదుగుతోంది. నవలలు ఇప్పుడు సినిమాగా తెరకెక్కకపోయినా.. కథలు ఇంకా రొటీన్ బాణీలోనే నడుస్తున్నా.. సినిమా నిర్మాణ 'గతి' నానాటికి పుంజుకుంటోంది. సినిమా స్కోప్.. 70 ఎంఎం.. డిజిటల్ ప్రాసెసింగ్.. ఇలా రూపాంతరం చెందుతోంది. అయితే బాధాకరం ఏంటంటే మన దగ్గరి కథలు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం లేదు. ఏదేమైనా మళ్లీ ఓ సారి గతంలోకి తొంగిచూస్తే మన సాహసాలు.. మన సానుకూల దృక్పథాలూ సాక్షాత్కారం అవుతాయి. వాటి నుంచి రేపటి గమనానికి కావాల్సిన కొన్ని ఆలోచనలు పుట్టుకువస్తాయి. సో.. మళ్లీ నాటి కాలానికి వెళ్తే.. అంటే కళ.. కళ కోసం కాదు.. సామాజిక ప్రయోజనం కోసం అన్న మాటలు తలుచుకుంటే గతమెంత ఘనం అనిపించకమానదు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. సారంగ (4 April 2013). "తెలుగు సినిమా చరిత్ర పై ఈ తరం వెలుగు రెంటాల జయదేవ !". సారంగ. Archived from the original on 7 August 2019. Retrieved 7 August 2019.

బయటి లింకులు, వనరులు

[మార్చు]


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |
{{bottomLinkPreText}} {{bottomLinkText}}
తెలుగు సినిమా చరిత్ర
Listen to this article

This browser is not supported by Wikiwand :(
Wikiwand requires a browser with modern capabilities in order to provide you with the best reading experience.
Please download and use one of the following browsers:

This article was just edited, click to reload
This article has been deleted on Wikipedia (Why?)

Back to homepage

Please click Add in the dialog above
Please click Allow in the top-left corner,
then click Install Now in the dialog
Please click Open in the download dialog,
then click Install
Please click the "Downloads" icon in the Safari toolbar, open the first download in the list,
then click Install
{{::$root.activation.text}}

Install Wikiwand

Install on Chrome Install on Firefox
Don't forget to rate us

Tell your friends about Wikiwand!

Gmail Facebook Twitter Link

Enjoying Wikiwand?

Tell your friends and spread the love:
Share on Gmail Share on Facebook Share on Twitter Share on Buffer

Our magic isn't perfect

You can help our automatic cover photo selection by reporting an unsuitable photo.

This photo is visually disturbing This photo is not a good choice

Thank you for helping!


Your input will affect cover photo selection, along with input from other users.

X

Get ready for Wikiwand 2.0 🎉! the new version arrives on September 1st! Don't want to wait?